సొంతగడ్డపై టీమిండియా చెత్త రికార్డు

  • బెంగళూరులో టీమిండియా × న్యూజిలాండ్
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 ఆలౌట్
  • గతంలో సొంతగడ్డపై 75 పరుగులకు ఆలౌటైన భారత్
  • 37 ఏళ్ల నాటి రికార్డు తెరమరుగు
న్యూజిలాండ్ తో మొదటి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో అనూహ్య రీతిలో 46 పరుగులకే కుప్పకూలింది. పిచ్ పై ఉన్న తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. ఈ ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. 

ఇప్పటివరకు టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 75 పరుగులకే ఆలౌటైంది. 37 ఏళ్ల నాటి ఈ రికార్డు నేటితో తెరమరుగైంది. 

ఇక విదేశాల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 36 పరుగులు. 2020లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్ తర్వాత భారత్ మరోసారి 50 పరుగుల లోపే ఆలౌట్ కావడం మళ్లీ ఇవాళే చోటుచేసుకుంది.

ఓ ఇన్నింగ్స్ లో ఐదు డకౌట్లు... ఇది రెండోసారి

ఇవాళ న్యూజిలాండ్ చేతిలో భారత్ 46 పరుగులకే ఆలౌట్ కాగా, అందులో ఐదు డకౌట్లు ఉన్నాయి. సొంతగడ్డపై ఓ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు ఐదుగురు డకౌట్ కావడం ఇది రెండోసారి. 1999లో మొహాలీ టెస్టు మ్యాచ్ లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు సున్నా చుట్టారు. ఆ మ్యాచ్ కూడా న్యూజిలాండ్ తోనే కావడం గమనార్హం. 


More Telugu News