బెంగళూరు టెస్టులో విఫలమైనప్పటికీ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

  • భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానానికి చేరిన విరాట్
  • మొత్తం 536 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కోహ్లీ
  • 535 మ్యాచ్‌లతో మూడవ స్థానానికి పడిపోయిన ఎంఎస్ ధోనీ
  • ఏకంగా 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్
బెంగళూరు వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. 9 బంతులు ఎదుర్కొని కనీసం ఒక్క పరుగు కూడా సాధించకుండా ఔటయ్యాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో చోటు దక్కించుకోవడం ద్వారా కోహ్లీ ఒక ఆల్ టైమ్ రికార్డును అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని భారత్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండవ ఆటగాడిగా విరాట్ అవతరించాడు. ఈ ఆల్‌టైమ్ జాబితాలో మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీని కోహ్లీ వెనక్కి నెట్టాడు. భారత్ తరపున విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 536 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 535 అంతర్జాతీయ మ్యాచ్‌లతో ధోనీ ఈ జాబితాలో మూడవ స్థానానికి పడిపోయాడు. కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఏకంగా 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

భారత్ తరఫున అత్యధిక మ్యా‌చ్‌లు ఆడిన ఆటగాళ్లు..
1. సచిన్ టెండూల్కర్ - 664 మ్యాచ్‌లు
2. విరాట్ కోహ్లీ - 536 మ్యాచ్‌లు
3. ఎంఎస్ ధోనీ - 535 మ్యాచ్‌లు
4. రాహుల్ ద్రావిడ్ - 504 మ్యాచ్‌లు
5. రోహిత్ శర్మ - 486 మ్యాచ్‌లు
6. మహమ్మద్ అజారుద్దీన్ - 433 మ్యాచ్‌లు
7. సౌరవ్ గంగూలీ - 421 మ్యాచ్‌లు
8. అనిల్ కుంబ్లే - 401 మ్యాచ్‌లు
9. యువరాజ్ సింగ్ - 399 మ్యాచ్‌లు
10. హర్భజన్ సింగ్ - 365 మ్యాచ్‌లు

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నారు. మిగతావారంతా రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్, రోహిత్ ఇద్దరూ క్రియాశీలకంగానే ఉన్నప్పటికీ అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ను చేరుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా కోహ్లీకి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నప్పటికీ ఎంతవరకు సచిన్‌ను చేరుకుంటాడనేది వేచిచూడాలి.


More Telugu News