ఒకేసారి ఆరు కొత్త పాలసీలు తీసుకువచ్చాం: సీఎం చంద్రబాబు

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు ప్రెస్ మీట్
  • పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరాలు వెల్లడి
ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. మీడియా సమావేశంలో ఆయన పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకేసారి ఆరు కొత్త పాలసీలు తీసుకువచ్చామని వెల్లడించారు. 

1. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 
2. ఏపీ ఎంఎస్ఎంఈ, ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ పాలసీ
3. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
4. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ
5. ఏపీ ప్రైవేటు పార్కుల పాలసీ
6. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ
... తీసుకువచ్చినట్టు వివరించారు. 

ఇవాళ్టి క్యాబినెట్ సమావేశంలో ఈ ఆరు కొత్త పాలసీలపై చర్చించి ఆమోదం తెలిపామని చంద్రబాబు పేర్కొన్నారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదం అని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. 

వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనేది తమ ప్రభుత్వ నినాదమని చంద్రబాబు తెలిపారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త ఉండడమే తమ విజన్ అని, ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలోనూ తాము ఇదే చెప్పామని గుర్తు చేశారు. 

పెట్టుబడులు తీసుకువస్తాం... అభివృద్ధి చేస్తాం... సంపద పెంచుతాం... పెంచిన ఆదాయం పేదలకు సంక్షేమ రూపంలో అందిస్తాం అని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు రాబట్టడంపై దృష్టి సారిస్తామని, తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

"నాలెడ్జ్ ఎకానమీ, అగ్రికల్చర్, ఆక్వా, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు మన రాష్ట్ర బలాలు. పెట్టుబడి రహిత ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహిస్తాం. ఎంఎస్ఎంఈలను భారీ ఎత్తున ముందుకు తీసుకెళతాం... ప్రతి కుటుంబం ఒక చిన్న తరహా పరిశ్రమ పెట్టేలా ప్రోత్సహిస్తాం. అందుకోసం ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి, సాయం చేస్తుంది. 

ఇక, రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతాం. రాయలసీమ ప్రాంతానికి ఉన్న అనుకూలతను సద్వినియోగం చేసుకుంటాం. ఇక్కడ భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉంది... ఆటోమొబైల్ హబ్ కావడానికి అవసరమైన అన్ని అంశాలు రాయలసీమలో ఉన్నాయి. సౌర, పవన శక్తిని కూడా ముందుకు తీసుకెళతాం. వీటన్నింటిని సమీకృతం చేస్తూ రాయలసీమను మరో స్థాయికి తీసుకెళతాం. 

అదే సమయంలో, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు తగిన ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టు, భావనపాడు పోర్టులను సకాలంలో పూర్తి చేస్తాం. ఇక్కడ 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ను అభివృద్ధి చేస్తాం. విశాఖను బెస్ట్ సిటీగా, నాలెడ్జ్ ఎకానమీకి కేరాఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దుతాం. 

ఇకపై ఏపీలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కాదు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఉంటుంది. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే అన్ని మంచి రాయితీలు అందిస్తాం. గ్లోబల్ బ్రాండ్స్ ను మరింత ముందుకు తీసుకెళతాం. ఫార్చూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తాం. 

మా విజన్ స్వర్ణాంధ్ర-2047. పరిశ్రమలకు సంబంధించి ఉత్పాదక వ్యయం తగ్గించాలనేది మా లక్ష్యం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచుతూ, అంతర్జాతీయస్థాయి తయారీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం. ఒక్క తయారీ రంగంలోనే ఐదు లక్షల ఉద్యోగాలను సాధించడం మా టార్గెట్. 

ప్రతి నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువగా ఇండస్ట్రియల్  పార్కులు ఉండేలా చూస్తాం... మా ఇండస్ట్రియల్ పాలసీలో ముఖ్యమైన అంశం కూడా ఇదే. తూర్పు తీరంలో మన రాష్ట్రం మధ్యలో ఉంటుంది.. అదే మన  బలం. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం" అని చంద్రబాబు వివరించారు.


More Telugu News