ఆటగాడిపై దాడి.. బంగ్లాదేశ్ కోచ్‌ తొలగింపు

  • గతేడాది వన్డే వరల్డ్ కప్ సమయంలో ఓ ఆటగాడిపై దాడి చేసిన చండికా హతురుసింఘే
  • ఒప్పందానికి మించి సెలవులు తీసుకున్నాడని పేర్కొన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్
  • తాత్కాలిక కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సీమన్స్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కోచ్ చండికా హతురుసింఘేను తొలగిస్తూ బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్) అనూహ్య ప్రకటన చేసింది. గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌ 2023 సమయంలో ఓ ఆటగాడిపై దాడికి పాల్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ ప్రకటించారు. హతురుసింఘే రెండు దుష్ప్రవర్తనలకు పాల్పడ్డాడని ఆయన వివరించారు. ఆటగాడిపై దాడికి పాల్పడడం మొదటి తప్పు, కాగా కాంట్రాక్ట్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ సెలవులు తీసుకోవడం రెండవ తప్పిదమని ఫరూక్ అహ్మద్ వెల్లడించారు.

48 గంటల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చామని, ఆ తర్వాత అతడి కాంట్రాక్ట్ రద్దు చేస్తామని అహ్మద్ తెలిపారు. నిజానికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అతడొక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తి కావడంతో మర్యాదపూర్వకంగా ఈ నోటీసులు ఇచ్చామని చెప్పారు. తొలగింపు వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

కాగా హతురుసింఘే దాడి చేసిన బాధిత ఆటగాడి పేరుని వెల్లడించేందుకు బీసీబీ ప్రెసిడెంట్ అహ్మద్ నిరాకరించారు. పేరు వెల్లడించే విషయంలో ఆటగాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని, అందుకే పేరు వెల్లడించడంలేదని అన్నారు. కాగా కోచ్ హతురుసింఘే ఓ ఆటగాడిని కొట్టినట్టు కొన్ని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై హతురుసింఘే ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కొత్త కోచ్‌గా ఫిల్ సీమన్స్
హతురుసింఘేపై తొలగింపు వేటు వేయడంతో అతడి స్థానంలో తాత్కాలిక కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సీమన్స్ పేరుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సీమన్స్ కోచ్‌గా పనిచేస్తారని వెల్లడించింది. కాగా సీమన్స్ గతంలో జింబాబ్వే, ఐర్లాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు.


More Telugu News