రష్మిక మందన్నాకు అరుదైన గౌరవం

  • సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ వింగ్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక ఎంపిక 
  • సైబర్‌ క్రైమ్‌పై అందరికి అవగాహన కల్పించాలన్న రష్మిక
  • తన ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన నటి
ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా అగ్రహీరోయిన్ల జాబితాలో ఉంది. సినిమాలతో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ పాల్గొనే ఈ కథానాయికను ఓ అరుదైన గౌరవం వరించింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ వింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మికను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం, బాధ్యతను అప్పజెప్పిన కేంద్ర హోంశాఖకు రష్మిక తన ధన్యవాదాలు తెలియజేసింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ '' కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. అదొక సైబర్ క్రైమ్. ఆ ఘటన జరిగినప్పటి నుంచి సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని, ఈ నేరాలపై పోరాడాలని నిర్ణయించుకున్నా. నా ప్రయత్నానికి అండగా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నిలిచింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా నాకు బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నా. 

సైబర్ నేరగాళ్లు అనేక పద్ధతుల్లో మనల్ని మోసగించాలని ప్రయత్నిస్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండటమే కాదు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి మోసాలను నివారించాలి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా సైబర్ క్రైమ్స్ పై మీ అందరికీ అవగాహన కల్పిస్తూనే ఉంటా" అని రష్మిక ఆ వీడియోలో తన స్పందనను తెలియజేసింది. 



More Telugu News