ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు

  • ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి శాస్త్రీయత లేదన్న సీఈసీ
  • అంచనాలతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందన్న ఎన్నికల సంఘం
  • ఎగ్జిట్ పోల్స్ విషయమై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచన
  • ఈవీఎం ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన సీఈసీ
ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలను సృష్టిస్తున్నాయన్నారు. ఇలాంటి అంచనాలతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందన్నారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో మీడియా సహా అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ముఖ్యంగా, మీడియా సంస్థలకు స్వీయ నియంత్రణ అవసరమని స్పష్టం చేశారు.

ఎగ్జిట్ పోల్స్‌తో తమకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. అయితే శాంపిల్ సైజ్ (సర్వే పరిధి) ఏమిటి? ఎక్కడ చేశారు? ఫలితాలు అందుకు అనుగుణంగా రాకుంటే బాధ్యత ఎవరిది? అనే విషయమై భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య అంతరం నిరాశకు దారి తీస్తుందన్నారు.

ఈవీఎం ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన రాజీవ్ కుమార్

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రజలే ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తారన్నారు. ఈవీఎంలు 100 శాతం ఫుల్ ప్రూఫ్‌గా ఉన్నాయని తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు నిరాధారమైనవన్నారు.


More Telugu News