రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం... కీలక పాలసీలపై తుది నిర్ణయం!

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
  • ఆరు కీలక పాలసీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
  • మూడు నెలల పాటు ఆయా పాలసీలపై కసరత్తులు చేసిన అధికారులు
  • వరుస సమీక్షలతో దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ క్యాబినెట్ సమావేశంలో ఆరు నూతన పాలసీలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నూతన పాలసీల అమలుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం, ముందుగా క్యాబినెట్ లో చర్చించనుంది. 

పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం, నిరుద్యోగులకు  ఉపాధి అవకాశాలు, ఎన్నికల హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, పెట్టుబడులు ఆకర్షించేలా ఆయా శాఖల్లో నూతన పాలసీలు తీసుకురానున్నారు. ఈ పాలసీలపై అధికారులు మూడు నెలల పాటు విస్తృతస్థాయిలో కసరత్తులు చేసి, ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన పాలసీలను సిద్ధం చేశారు.

ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ, పాలసీల రూపకల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జాబ్ ఫస్ట్ ప్రధాన లక్ష్యంతో ఈ పాలసీలకు తుదిరూపు కల్పించారు. పారిశ్రామికాభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై రేపు క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.


More Telugu News