రాడార్ వ్యవస్థకు అనుమతిచ్చిన మీ తండ్రిని అడుగు!: కేటీఆర్‌కు బండి సంజయ్ సూచన

  • దామగుండం అటవీప్రాంతంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు
  • బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయన్న బండి సంజయ్
  • రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తే దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లేనని స్పష్టీకరణ
  • ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని వ్యాఖ్య
వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి అనుమతులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని, దీనికి అనుమతి ఎందుకు ఇచ్చారో మీ తండ్రినే అడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హితవు పలికారు. 

దామగుండం అడవుల్లో రాడార్ కేంద్ర ఏర్పాటును కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ స్పందిస్తూ... మీరు అధికారంలో ఉన్న సమయంలో మీరే అనుమతులు ఇచ్చి... ఇప్పుడు వ్యతిరేకిస్తారా? అని ప్రశ్నించారు. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పినప్పటికీ మార్పు రావడం లేదని విమర్శించారు. ఈ రాడార్ కేంద్ర ఏర్పాటు అంశం ఇప్పటిది కాదని, 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అడ్డంకులన్నీ దాటుకొని ఈ రోజు భూమిపూజ చేసుకున్నామని, ఇందుకు ఆనందంగా ఉందన్నారు. రాజ్ నాథ్ సింగ్ చొరవతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.

రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతి వచ్చిందని, 2017లో 2,900 ఎకరాల భూమిని బదిలీ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వ్యతిరేకించడం సరికాదన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కలిసి పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్ నేతల తీరును చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.


More Telugu News