ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప‌థ‌కం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

  • చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ కీలక ప్రకటన 
  • దీపావళి పండుగకు ఉచిత సిలిండర్ పథకం అమలు 
  • దీపావళి మ‌రుస‌టి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప‌థ‌కం
ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒక‌టి. ఈ ప‌థ‌కం అమ‌లు విష‌య‌మై ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌లు సంద‌ర్భాల్లో మాట్లాడారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ ఈ స్కీమ్‌పై కీలక ప్రకటన చేశారు. 

కూట‌మి ప్ర‌భుత్వం ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తుంద‌ని అన్నారు. అలాగే దీపావళి మ‌రుస‌టి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న‌ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి.. రేషన్‌ కార్డులు ఇవ్వాలి.. ఎన్టీఆర్‌ గృహాలు ఇవ్వాలి.. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని అన్నారు. 

వైసీపీ వాళ్లు ఉంటే బాగుండు.. వాళ్లేమీ చేయరు.. వీళ్చొచ్చి రోడ్లు, గీడ్లు వేస్తున్నారని బాధగా ఉందా? అని కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారిని త‌మాషాగా అడిగారు. మీరు ఆనందంగా ఉండాలనే అన్ని స్కీమ్‌ల‌ను మహిళలను ఉద్దేశించే చంద్రబాబు తీసుకొచ్చారని పేర్కొన్నారు. 

దీపావళికి ఉచిత సిలిండర్‌ పథకం అమ‌లు చేస్తామ‌న్న ఆయ‌న‌... ఆ మరుసటి రోజు నుంచే ఫ్రీ బ‌స్ స్కీమ్‌ను ప్రారంభిస్తామ‌ని అన్నారు. ఇలా దీపావళికి డబుల్‌ ధమాకా అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇదే విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్‌) వేదికగా కూడా ఎమ్మెల్యే జగన్‌ ప్రకటించారు. 


More Telugu News