చంద్రబాబు ఇంటిపై దాడికేసు.. పూర్వ డీఎస్పీ సంచలన వాంగ్మూలం

  • వెలుగులోకి నాటి డీఎస్పీ రాంబాబు వాంగ్మూలం
  • అప్పట్లో రాజధాని ఉద్యమ అణచివేతలో బిజీగా ఉన్నట్టు వాంగ్మూలం
  • అందుకే చంద్రబాబు ఇంటిపై దాడికేసును పట్టించుకోలేదని సమాధానం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో మంగళగిరి పూర్వ డీఎస్పీ రాంబాంబు ఇచ్చినట్టుగా చెబుతున్న వాంగ్మూలం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆయన పేర్కొన్న అంశాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. 

దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ.. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమాలు, రైతుల ఆందోళనల అణచివేతలో తీరిక లేకుండా ఉండడం వల్లే చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసును అంతగా పట్టించుకోలేకపోయానని వెల్లడించినట్టు తెలిసింది. ఉద్యమాలు, ఆందోళనలు అణచివేయాలని నాటి పాలకుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. అలాగే, ఆ కేసులో కీలకమైన సీడీఆర్, వీడియో ఫుటేజీలను కూడా ఆ కారణంగానే సేకరించలేకపోయానని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు నాటి ఉన్నతాధికారులు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని, దీనికి తోడు క్షేత్రస్థాయిలో తాము కూడా పట్టించుకోలేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో 30 మందికిపైగా దాడికి దిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంటే, కేవలం 10 మందినే ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చారన్న ప్రశ్నకు.. నాటి సీఐ, ఎస్సై నిందితులను గుర్తించి ఇచ్చిన సమాచారం ఆధారంగానే వారి పేర్లను నమోదు చేసినట్టు సమాచారం.


More Telugu News