అన్‌క్యాప్డ్ రూల్‌ను ధోనీ కోసమే మళ్లీ తెచ్చారా?

  • 2008లో ప్రవేశపెట్టిన అన్‌క్యాప్డ్ రూల్‌ను 2021లో రద్దు చేసిన బీసీసీఐ
  • తాజాగా ప్రకటించిన 2025-27 ప్లేయర్ రూల్‌లో మళ్లీ తీసుకొచ్చిన వైనం
  • ధోనీ కోసమేనంటూ క్రీడా పండితుల నుంచి విమర్శలు
  • అలాంటిదేమీ లేదని కొట్టిపడేసిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ మరో సీజన్‌లోనూ ఆడేలా కావాలనే బీసీసీఐ అన్‌క్యాప్డ్ నిబంధనను తిరిగి తీసుకొచ్చిందన్న వార్తలను ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కొట్టిపడేశారు. ఈ రూల్ కేవలం ధోనీ కోసం మాత్రమే కాదని, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

బీసీసీఐ ఇటీవల 2025-27కు సంబంధించి ఆటగాళ్ల నిబంధనలు ప్రకటించింది. ఇందులో భాగంగా అన్‌క్యాప్డ్ రూల్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం.. ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని భారత ఆటగాడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. తొలుత 2008లో ఈ రూల్‌ను తీసుకొచ్చిన బీసీసీఐ 2021లో దానిని రద్దుచేసింది.

రద్దు చేసిన ఈ నిబంధనను తిరిగి తీసుకురావడంపై అభిమానులు, క్రీడా పండితుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ధోనీ మరో సీజన్‌లో ఆడేందుకే బీసీసీఐ దీనిని తిరిగి తీసుకొచ్చిందని క్రీడా విశ్లేషకులు విమర్శించారు. అయితే, ఈ అభిప్రాయం సరికాదని ధుమాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

‘‘మ్యాచ్ ప్లానింగ్ విషయంలో కానీ, వ్యూహాల విషయంలో కానీ ధోనీకి ఎవరూ సరిపోలరు. అతడు అన్‌క్యాప్డ్ ఆటగాడా? క్యాప్డ్ ఆటగాడా? అని ఏ ఫ్రాంచైజీ చూడదు. అతడిని తీసుకోవాలనే అనుకుంటారు. ఇందుకోసం ధర విషయంలోనూ వెనకాడరు. కాబట్టి ఈ అన్‌క్యాప్డ్ రూల్ అతడి కోసమే తెచ్చామన్నది సరికాదు’’ అని ధుమాల్ చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంతోమంది సీనియర్ ఆటగాళ్లు ఆడేందుకు ఇంకా ఫిట్‌గా ఉన్నారని ధుమాల్ తెలిపారు. పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటివారు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమే అయినా వారింకా ఐపీఎల్‌లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలంటే రూ. 11 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌‌కైతే రూ. 4 కోట్లు ఫ్రాంచైజీలు చెల్లించాల్సి ఉంటుంది.


More Telugu News