రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్కువకాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది: కిషన్ రెడ్డి

  • పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్న కేంద్రమంత్రి
  • కాంగ్రెస్ పాలన కూడా బీఆర్ఎస్ పాలన లాగే ఉందని విమర్శ
  • తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆగ్రహం
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి బీజేపీ ఉద్యమ బాట పడుతుందన్నారు.

హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం చాలా వెనుకబడిందని విమర్శించారు.

రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన కూడా బీఆర్ఎస్ లాగే ఉందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టకుండా ఇళ్లు కూలుస్తున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.

మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో భారీ మొత్తాన్ని కేటాయించిందని, కానీ ఇంత వరకు డీపీఆర్ తయారు చేయలేదన్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతోనే హర్యానా రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి ఓటేశారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా ముందుకు పోనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత జమ్ము కశ్మీర్‌లో బీజేపీకి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందన్నారు.

ప్రతి పదేళ్లకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 2014లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత మళ్లీ ఇప్పుడు 2024లో చేస్తున్నామన్నారు.


More Telugu News