పండుగ సమయంలో బస్సు ఛార్జీలు అధికంగా వసూలు చేయడం దుర్మార్గం: హరీశ్ రావు

  • బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లిన వారి నుంచి ముక్కుపిండి వసూలు చేశారన్న హరీశ్ రావు
  • జేబీఎస్ నుంచి సిద్దిపేటకు రూ.200 వసూలు చేశారన్న హరీశ్ రావు
  • హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు రూ.420 వసూలు చేశారని ఆగ్రహం
దసరా పండుగపూట ఆర్టీసీ బస్సు ఛార్జీలను అధికంగా వసూలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇందుకు సంబంధించి హన్మకొండ - ఉప్పల్ క్రాస్ రోడ్స్, సిద్దిపేట - జూబ్లీ బస్ స్టాండ్‌కు ప్రయాణికులు ప్రయాణించిన బస్ టిక్కెట్లను ట్వీట్‌లో జత పరిచారు. పండుగ సమయంలో అధికంగా వసూలు చేశారన్నారు.

ఆర్టీసీ టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

టిక్కెట్ ధర రూ.140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే, హన్మకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ.300 ఉంటే, పండుగ సమయంలో చార్జీని రూ.420కు పెంచారన్నారు.

"పండుగ సమయంలో కనీసం బస్సుల సంఖ్య పెంచకుండా, టిక్కెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు?" అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News