గాయపడిన 17 మందిని పట్టుకుని చంపేశారు: మావోయిస్టు పార్టీ

  • ఈ నెల 4వ తేదీన భారీ ఎన్ కౌంటర్
  • ఎన్ కౌంటర్ లో 31 మంది మావోలు హతం
  • గాయపడిన వారిని మరుసటి రోజు చంపేశారన్న మావోయిస్టు పార్టీ
ఈ నెల 4వ తేదీన ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని... ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు అమరులయ్యారని మావోయిస్ట్ పార్టీ తెలిపింది. కాల్పుల్లో గాయపడిన 17 మంది మావోయిస్టులను ఆ మరుసటి రోజు పట్టుకుని కాల్చి చంపారని వెల్లడించింది.

తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మేరకు తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖను విడుదల చేసింది. అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపింది.

ఆరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఒక ఐఎంజీ మెషిన్ గన్, 4 ఏకే47 గన్స్, ఇతర తుపాకులు, బుల్లెట్లు, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు లేరని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు.


More Telugu News