వాళ్లంతా సర్వనాశనమైపోతారు .. ఇది నా శాపం: చలాకీ చంటి

  • తనకి వంట్లో బాగోలేకపోతే ఎవరూ పలకరించలేదన్న చంటి  
  • ఎవరూ పట్టించుకోలేదని వెల్లడి  
  • ఇక్కడ డబ్బుకు తప్ప దేనికీ విలువలేదని వ్యాఖ్య  
  • దేవుడిని రోజూ కోరుకునేది ఇదేనన్న చంటి

చలాకీ చంటి మంచి కమెడియన్. 'జబర్దస్త్'తో పాటు కొన్ని కామెడీ షోలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి చంటీ ఆ మధ్య తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యాడు. ఆ తరువాత నుంచి ఆయన కోలుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంటీ మాట్లాడుతూ . "ఆ మధ్య నేను హాస్పిటల్ పాలైనప్పుడు ఒకరిద్దరు తప్పా, ఎవరూ కూడా నన్ను పలకరించలేదు. అంతకుముందు వరకూ నాతో ఉన్నవారు ఆ సమయంలో కనిపించలేదు" అన్నాడు. 

" నన్ను చూసిన వాళ్లంతా బాగా సంపాదిస్తున్నాడని అనుకుంటారు. కానీ అలా కనిపించకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు .. ఎవరూ దేనికీ పిలవరు. అందువలన కష్టమైనా .. నష్టమైనా మెయింటైన్ చేయాలి. అలా చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇక్కడ ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే 'బాగున్నావా' అని అడుగుతారు. బాగోలేకపోతే కనిపించకుండా పోతారు. ఇది కలియుగం .. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి లేదు .. ఎవరిపై ఆశలు పెట్టుకోకూడదు" అని చెప్పాడు. 

"నాకు ఇగో ఎక్కువనీ .. షూటింగుకు వస్తే నేను చాలా అడుగుతానని కొంతమంది ప్రచారం చేశారు. కొంతమంది నాకు సంబంధంలేని విషయాల్లో నన్ను ఇరికించారు. నాకు రావలసిన అవకాశాలు రాకుండా ఆపేశారు. అలాంటి వాళ్లంతా సర్వనాశనమై పోతారు .. వాళ్లందరికీ ఇదే నా శాపం. ప్రత్యక్షంగా గానీ .. పరోక్షంగా గాని నాకు చెడు చేయడానికి ప్రయత్నించిన వాళ్లంతా నాశనమైపోతారు. అలా జరగాలని దేవుడిని రోజుకి వందసార్లు కోరుకుంటున్నా" అని అన్నాడు. 



More Telugu News