చంద్రబాబు నాకు స్ఫూర్తి.. ఆయన అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం: పవన్ కల్యాణ్

  • చంద్రబాబు అనుభవం ఏపీకి బలమన్న పవన్ కల్యాణ్
  • అధికారులు పారదర్శకంగా పని చేయాలని హెచ్చరిక
  • చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్య
  • పల్లెల్లో వెలుగులు నిండాలన్న డిప్యూటీ సీఎం
  • రోడ్ల పనులు సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామన్న పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఎంతో బలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అవసరమని... చంద్రబాబు వంటి నాయకుడి అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసినవాళ్లమవుతామని చెప్పారు. అందుకే టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని అన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎన్నో దెబ్బలు తిన్నామని... తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం తనకు ఇష్టం ఉండదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఎంతో పారదర్శకంగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా పారదర్శకతతో పని చేయాలని సూచించారు. ఏ అధికారి అయినా తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

రాష్ట్ర ప్రజలంతా బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలని, పల్లెల్లో వెలుగులు నిండాలని అన్నారు. ఇవన్నీ జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉందని... ఆ పార్టీని ఓడించేందుకు గట్టిగా కృషి చేశామని చెప్పారు. చంద్రబాబు బలమైన నాయకత్వం వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. పరిపాలన వేరు, రాజకీయాలు వేరని చెప్పారు.

3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేశారు. సంక్రాంతి నాటికి రోడ్ల పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించామని ఆయన చెప్పారు. అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకొస్తున్నారని చెప్పారు. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పంచాయతీ పనులు కొనసాగుతాయని అన్నారు. రూ. 4,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పనులు చేస్తున్నామని చెప్పారు.


More Telugu News