ఒక్క టికెట్ ధర రూ.31 లక్షలు.. రఫెల్ నాదల్ వీడ్కోలు టోర్నీ మ్యాచ్‌ టికెట్ల ధరలకు రెక్కలు

  • ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్
  • నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ చివరిదని ప్రకటన
  • చివరి మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు టికెట్ల కోసం ఎగబడుతున్న అభిమానులు
  • రీసెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఆకాశాన్ని తాకుతున్న ధరలు
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం, ‘స్పెయిన్ బుల్’ రఫెల్ నాదల్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్వదేశంలో నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్-2024 తనకు చివరిదని వెల్లడించాడు. కార్లోస్ అల్కరాస్, రాబర్టో బటిస్టా, పాబ్లో కారెనో, మార్సెల్ గ్రానోల్లర్స్‌ వంటి టెన్సిస్ స్టార్లతో నాదల్ తలపడనున్నాడు. నాదల్‌కు ఇదే చివరి టోర్నమెంట్ కావడంతో అతడు ఆడనున్న మ్యాచ్‌ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నాదల్ ఆటను చివరిసారిగా ఎలాగైనా ఆస్వాదించాలని అభిమానులు భావిస్తుండడం, డబుల్స్‌లో అల్కరాస్‌తో నాదల్ జత కడుతుండడం టికెట్ల డిమాండ్ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోగా.. ఈ టికెట్లను రీసెల్లర్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. రీసెల్లింగ్ టికెట్ ప్లాట్‌ఫామ్ ‘వయాగోగో’పై ఒక టికెట్ రేటు ఏకంగా 34,500 యూరోలు పలికింది. అంటే భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.31 లక్షలుగా ఉంది. దీనిని బట్టి రీసెల్లింగ్ టికెట్లు ఏ రేంజ్‌లో అమ్ముడుపోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కాగా రఫెల్ నాదల్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో అతడు దాదాపు 209 వారాల పాటు కొనసాగాడు. తన టెన్నిస్ కెరీర్‌లో ఏకంగా 22 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఇందులో రికార్డు స్థాయిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. ఏటీపీ-స్థాయి 92 సింగిల్స్ టైటిల్స్, ఒక ఒలింపిక్ బంగారు పతకాన్ని కూడా సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా అతడికి లెక్కలేనంతమంది టెన్నిస్ అభిమానులు ఉన్నారు.


More Telugu News