నారా రోహిత్ కు కాబోయే భార్యది ఏ ఊరు? ఆమె వివరాలు ఏమిటి?

  • హీరోయిన్ శిరీషను పెళ్లి చేసుకోబోతున్న నారా రోహిత్
  • నిన్న ఘనంగా హైదరాబాద్ లో నిశ్చితార్థం
  • శిరీషది పల్నాడు జిల్లా రెంటచింతల
  • ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివిన శిరీష
  • సినీరంగంపై అభిమానంతో హైదరాబాద్ కు వచ్చిన వైనం
సినీ నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శిరీషను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి నిశ్చితార్థం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరై కాబోయే భార్యాభర్తలను ఆశీర్వదించారు. నారా రోహిత్ ను పెళ్లి చేసుకోబోతున్న శిరీష ఎవరు? ఎక్కడి వారు? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఆమె గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 

శిరీష స్వస్థలం ఏపీలోని పల్నాడు జిల్లా రెంటచింతల. వీరిది సామాన్య రైతు కుటుంబం. ఆమె తండ్రి పేరు నాగేశ్వరావు. వీరిది గురజాల మండలంలోని దైద గ్రామం. 30 ఏళ్ల క్రితం వీరి కుటుంబం రెంటచింతలకు వలస వచ్చింది. నాగేశ్వరరావుకు నలుగురు కుమార్తెలు. కష్టపడి వ్యవసాయం చేస్తూనే ఆయన తన నలుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. 

నాగేశ్వరరావు పెద్ద కుమార్తె శ్రీలక్ష్మి రెంటచింతలలోనే అంగన్ వాడీ సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. రెండో కూతురు భవాని వివాహానంతరం అమెరికాలో స్థిరపడ్డారు. మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన నాలుగో కూతురు శిరీష...  నారా రోహిత్ కు కాబోయే భార్య. 

శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివారు. అక్కడే కొంత కాలం ఉద్యోగం కూడా చేశారు. అయితే, సినీరంగంపై ఉన్న అభిమానంతో ఆమె హైదరాబాద్ కు వచ్చారు. తన మూడో అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు నారా రోహిత్ సరసన 'ప్రతినిధి 2'లో నటించే అవకాశం వచ్చింది. ఇదే సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. నిన్న హైదరాబాద్ లో ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.


More Telugu News