టెస్టు జ‌ట్టు నుంచి బాబ‌ర్ ఔట్‌.. ఫ‌క‌ర్ జమాన్ పోస్టు వైర‌ల్‌!

  • ఇంగ్లండ్‌తో రాబోయే రెండు టెస్టుల‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన పీసీబీ
  • బాబర్, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిదీల‌కు ద‌క్క‌ని చోటు
  • బాబ‌ర్‌ను జ‌ట్టు నుంచి తొల‌గించ‌డంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఫ‌క‌ర్ జ‌మాన్‌
  • ఇలాంటి స్టార్ ప్లేయ‌ర్‌ను బెంచ్‌కి ప‌రిమితం చేయ‌డం జ‌ట్టుకు తీవ్ర న‌ష్ట‌మ‌ని వ్యాఖ్య‌
  • ఇది వారికి కేవ‌లం విశ్రాంతి మాత్ర‌మేన‌న్న సెలెక్ట‌ర్ అకిబ్ జావేద్
ఇంగ్లండ్‌తో రాబోయే రెండు టెస్టుల‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్టార్ ఆట‌గాడు, మాజీ కెప్టెన్‌ బాబ‌ర్ ఆజాంను ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే. పీసీబీ నిర్ణ‌యంపై ఇప్పుడు నెట్టింట మిశ్ర‌మ స్పంద‌న వస్తోంది. ఫామ్‌లేమితో ఇబ్బంది ప‌డుతున్న బాబ‌ర్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డం మంచిదేనని కొందరు అంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం స్టార్ ప్లేయ‌ర్‌ను ఇలా చేయ‌డం మంచిది కాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. 

ఈ నేప‌థ్యంలో ఆ జ‌ట్టు సీనియ‌ర్ క్రికెట‌ర్ ఫ‌క‌ర్ జమాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బాబర్‌లాంటి ఆట‌గాడిని బెంచ్‌కి ప‌రిమితం చేయ‌డం అనేది జ‌ట్టుకు తీవ్ర న‌ష్టం అనే ధోర‌ణిలో ఫ‌క‌ర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించాడు. ఒక స్టార్ ప్లేయ‌ర్‌ను ఇలా చేయ‌డం ఆందోళ‌న‌క‌రం అని పేర్కొన్నాడు. 

ఈ సంద‌ర్భంగా 2020 నుంచి 2023 మధ్యకాలంలో విరాట్ కోహ్లీ ఫామ్‌ను కోల్పోయి ఇబ్బందిప‌డ్డ స‌మ‌యంలో బీసీసీఐ అండ‌గా నిల‌వ‌డాన్ని ఉదాహ‌రించాడు. ఆ మూడేళ్లు కోహ్లీ బ్యాటింగ్‌ సగటు 19.33, 28.21, 26.50 మాత్రమేన‌ని, అయినా భారత్ బెంచ్‌కి ప‌రిమితం చేయలేద‌ని అన్నాడు. ఇలాంటి నిర్ణ‌యాలు జ‌ట్టులోని మిగ‌తా స్టార్ ప్లేయ‌ర్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చాడు. 

"మనం మ‌న‌ ప్రీమియర్ బ్యాట్స్‌మన్‌ను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, అది నిస్సందేహంగా జట్టులోని ఇత‌ర అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కు తీవ్ర ప్రతికూల సందేశాన్ని పంపవచ్చు. పానిక్ బటన్‌ను నొక్కటానికి ఇంకా సమయం ఉంది. మ‌నం మ‌న‌ కీలక ఆటగాళ్లను రక్షించడంపై దృష్టి పెట్టాలి. వారిని అణగదొక్కడం కాదు" అని ఫ‌క‌ర్‌ జమాన్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

మ‌రోవైపు  కొత్త సెలెక్టర్లలో ఒకరైన అకిబ్ జావేద్ మాట్లాడుతూ... ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయడం తమకు సవాలుతో కూడుకున్న పని అని అన్నారు.

"మేము ప్రస్తుత ఆటగాడి ఫామ్‌ను, సిరీస్‌లో పుంజుకోవాల్సిన ఆవశ్యకతను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వ‌చ్చింది. పాకిస్థాన్ 2024-25 అంతర్జాతీయ షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, పాకిస్థాన్ క్రికెట్‌తో పాటు ఆటగాళ్లకు కూడా మేలు చేస్తున్నాం. బాబర్ ఆజం, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిదీలకు విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకున్నాం" అని అకిబ్ అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుండి ఈ విరామం అనేది ఈ ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, ప్రశాంతతను తిరిగి పొందడంలో సహాయపడుతుందని అన్నాడు. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల కోసం వారు దృఢంగా మారుతారని తెలిపాడు. త‌ద్వారా వారంతా అత్యుత్తమంగా జ‌ట్టులోకి తిరిగి  వస్తారని సెలక్టర్లు విశ్వసిస్తున్నారంటూ అకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు.


More Telugu News