కోకా-కోలా రహస్యాలను పెప్సీకి విక్రయించే కుట్ర భగ్నం.. ఎంతకు బేరం పెట్టారంటే!

  • చట్టవిరుద్ధ సమాచారాన్ని స్వీకరించేందుకు తిరస్కరించిన పెప్సీ
  • కోకా-కోలాతో పాటు ఎఫ్‌బీఐకి సమాచారం ఇచ్చిన పెప్సీ అధికారులు
  •  రహస్య ఆపరేషన్‌లో నిందితుల పట్టివేత
కోకా-కోలా డ్రింక్ తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంటుందనే విషయం తెలిసిందే. మరో కొత్త ఉత్పత్తిని సైతం మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. అయితే ఈ నూతన ప్రొడక్ట్‌కు సంబంధించిన వ్యాపార రహస్యాలను మార్కెట్ ప్రత్యర్థి పెప్సీకి విక్రయించేందుకు కోకా-కోలా గ్లోబల్ హెడ్ ఆఫీస్‌లో పనిచేసే జోయా విలియమ్స్ అనే ఓ సెక్రటరీ ప్రయత్నించింది. విషయం బయటకు రావడంతో ఆమెతో పాటు సహ కుట్రదారులుగా ఉన్న ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరు ముగ్గురూ కలిసి దొంగిలించిన కోకాకోలా సమాచారాన్ని ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.12.6 కోట్లు) భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే చట్టవిరుద్ధమైన ఈ ఆఫర్‌‌ను పెప్సీ తిరస్కరించింది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకోకుండా కోకా-కోలా కంపెనీతో పాటు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి సమాచారం ఇచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా ప్రధాన నిందితురాలు జోయా విలియమ్స్.. కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేశారు. ఒక రహస్య నూతన ఉత్పత్తిని ఉంచిన చిన్న బాటిల్‌ను దొంగిలించారు. ఈ బాటిల్‌ను విక్రయించబోయి పట్టుబడ్డారు. నిందితులను పట్టుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు రహస్య ఆపరేషన్‌ను కూడా నిర్వహించింది. పెప్సీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లుగా ఎఫ్‌బీఐ అధికారులు నటించారు. దశలవారీగా రహస్యాల మార్పిడి ప్రక్రియలో భాగంగా డిమ్సన్ రహస్యమైన కోకా-కోలా పత్రాలు, చిన్న బాటిల‌ను అందజేశాడు. బదులుగా 30,000 డాలర్ల నగదును స్వీకరించాడు. అండర్‌కవర్ ఆపరేషన్ పూర్తయ్యేలోగా జోయా విలియమ్స్, సహ కుట్రదారులుగా ఉన్న ఆమె సహచరులు అందరినీ ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

కాగా రహస్య సమాచారాన్ని స్వీకరించకుండా సమాచారాన్ని అందించిన పెప్సీ కంపెనీ నిర్ణయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డేవిడ్ నహ్మియాస్ ప్రశంసించారు. ఇక నిందితులు జోయా విలియమ్స్, ఆమె సహచరులు చట్టవిరుద్ధంగా వ్యాపార రహస్యాలను దొంగిలించడం, విక్రయించడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారని ప్రాసిక్యూటర్ చెప్పారు. కోకా-కోలా కోక్ అంతర్గత పత్రాలు, బాటిల్‌ అందివ్వాలంటే ప్రారంభంలో 10,000 డాలర్లు (సుమారు రూ. 8,41,373) చెల్లించాలని డిమాండ్ చేశారని, డబ్బుకు ‘డిర్క్’ అనే మారుపేరుతో పెప్సీకి లేఖ రాశారని ప్రాసిక్యూటర్ వివరించారు.


More Telugu News