టీ20 మహిళా ప్ర‌పంచ‌క‌ప్‌: త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓడిన భార‌త్‌.. ఇప్పుడు ఆశ‌ల‌న్నీ పాక్‌పైనే!

  • షార్జా వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ మ్యాచ్‌
  • 9 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి
  • హ‌ర్మ‌న్ ప్రీత్ అర్ధ శ‌త‌కం (54) వృథా 
  • ఇవాళ్టి మ్యాచ్‌లో కివీస్‌ను పాక్ ఓడిస్తే భార‌త్ సెమీస్‌కు
యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త మ‌హిళా జ‌ట్టుకు భంగ‌పాటు ఎదురైంది. ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఓట‌మితో టీమిండియా సెమీస్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టంగా మారాయి. త‌ప్ప‌క గెల‌వాల్సిన ఈ మ్యాచ్‌లో హ‌ర్మన్‌ప్రీత్ సేన 9 ప‌రుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. నాలుగు మ్యాచుల్లో రెండు విజ‌యాలు, రెండు ఓట‌ముల‌తో ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 4 పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. 

గ్రూప్‌-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇప్ప‌టికే సెమీస్‌కు దూసుకెళ్లింది. మ‌రో బెర్త్ కోసం పాకిస్థాన్‌, భార‌త్‌, కివీస్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఇవాళ్టి పాక్‌, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ సందిగ్ధ‌తపై క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిస్తే మంచి నెట్ ర‌న్ రేట్ కార‌ణంగా టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు మార్గం సుగ‌మ‌మవుతుంది. ఒక‌వేళ కివీస్‌ గెలిస్తే ఇండియా ఇంటికి వ‌చ్చేస్తుంది.

ఇక నిన్న‌టి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 151 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో గ్రేస్ హారిస్ 40 ర‌న్స్ చేయ‌గా... టాహ్లియా, పెర్రీ చెరో 32 ప‌రుగులు చేశారు. భార‌త అమ్మాయిల్లో రేణుక‌, దీప్తి చెరో రెండు వికెట్లు తీస్తే... రాధా యాద‌వ్‌, శ్రేయాంక‌, పూజ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం 152 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన టీమిండియా 142 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో భార‌త్ 9 ర‌న్స్ తేడాతో ప‌రాజ‌యం పాలైంది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ హాఫ్ సెంచ‌రీ (54 నాటౌట్‌)చేసి చివ‌రి వ‌ర‌కు పోరాడినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దీప్తి శ‌ర్మ 29, ష‌ఫాలీ వ‌ర్మ 21 ప‌రుగులు చేశారు. చివ‌రి ఓవ‌ర్‌లో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోవ‌డం కొంప‌ముంచింది. చివ‌రికి ఓట‌మితో మ్యాచ్‌ను ముగించింది హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌. దీంతో నేడు పాక్‌తో జ‌రిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే టీమిండియా ఇంటిబాట ప‌డుతుంది.


More Telugu News