చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్.. అన్నట్టుగానే బాబా సిద్దిఖీ హత్య

  • మహారాష్ట్ర మాజీ మంత్రి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
  • హెచ్చరికల నేపథ్యంలో సెక్యూరిటీ పెంచిన ప్రభుత్వం
  • కన్ స్ట్రక్షన్ బిజినెస్ శత్రువుల నుంచే హెచ్చరికలు!
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికార వర్గాల సమాచారం మేరకు.. పదిహేను రోజుల క్రితమే బాబా సిద్ధిఖీని చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. అధికారులు ఆయన సెక్యూరిటీని పెంచి వై కేటగిరి రక్షణ కల్పించారు. సిద్ధిఖీకి కన్ స్ట్రక్షన్ బిజినెస్ ఉందని అధికారులు చెప్పారు. హెచ్చరికలు పంపిన వ్యక్తులు బిజినెస్ కు సంబంధించిన వారేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. సిద్ధిఖీ హత్యకు దుండగులు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ హత్య కాంట్రాక్ట్ కిల్లింగ్ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అదే సమయంలో ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. బాబా సిద్ధిఖీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దగ్గరి స్నేహితులు.. ఇటీవల సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో బాబా సిద్ధిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్రలో సీనియర్ రాజకీయవేత్త అయిన బాబా సిద్ధిఖీ గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సిద్ధిఖీ కుమారుడు జీషాన్ బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే.


More Telugu News