మా లాంటి వాళ్లకు తిరుమలలో దర్శనానికి అవకాశం ఉందా, లేదా అనేది టీటీడీనే చెప్పాలి: దువ్వాడ శ్రీనివాస్

  • తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ కథనాలపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
  • తిరుమలలో ఎలాంటి తప్పు, అపచారం చేయలేదని స్పష్టం చేసిన దువ్వాడ
  • వ్యక్తిగత అంశాలతో రాజకీయంగా ఇరికించాలని భావిస్తున్నారని దువ్వాడ ఆరోపణ  
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ప్రముఖ అథ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవడమే కాకుండా రీల్స్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మాధురితో కలిసి ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారన్నారు. తిరుమల కొండపై తాము ఎలాంటి తప్పు, అపచారం చేయలేదని స్పష్టం చేశారు. మా లాంటి వాళ్లు తిరుమలకు రావచ్చో లేదో టీటీడీ అధికారులు క్లారిటీ ఇవ్వాలన్నారు. నాలుగు రోజుల తర్వాత తమపై కేసులు పెట్టారని అన్నారు. కేసులను కోర్టులో ఎదుర్కొంటామని చెప్పారు. 

వ్యక్తిగత అంశాలను తమ పార్టీ పట్టించుకోదని అన్నారు. పార్టీకి వ్యక్తిగత అంశాలను ముడిపెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. పార్టీకి తానే ఈ విషయాన్ని తెలియజేసానని, వైసీపీ తనను సస్పెండ్ చేసినా ఫరవాలేదని అన్నారు. ముందుగా టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే తిరుమలకు వచ్చే వాళ్లం కాదని అన్నారు. ఒక వేళ తిరుమల కొండపై తాము తప్పు చేస్తే భగవంతుడే శిక్షిస్తాడని అన్నారు.


More Telugu News