వీటితో బతుకమ్మ పాటను ఆపలేరు: జగదీశ్ రెడ్డి

  • సీఎం రేవంత్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు
  • బతుకమ్మ పాట వింటేనే రేవంత్ కు వణుకు పుడుతుందని వ్యాఖ్య
  • మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
దాడులు, నిషేధాలు, కేసులతో బతుకమ్మ పాటను ఆపలేరని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బతుకమ్మ పాట వింటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందని చెప్పారు. అట్లతద్దె సంస్కృతి ఉన్నవారితో అంటకాగిన రేవంత్... బతుకమ్మకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని విమర్శించారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. బతుకమ్మ పండుగ కల తప్పిందని ప్రజలు అనడం రేవంత్ పాలనకు నిదర్శనమని చెప్పారు. 

పండుగ ఏర్పాట్లలో విఫలమైనందున... ఇప్పటికైనా రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్స్ ను, సోషల్ మీడియాను ఆపగలదేమో కానీ... ఉద్యమాలను ఆపలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజల మధ్యకు ఎప్పుడు రావాలో తమ అధినేత కేసీఆర్ కు తెలుసని చెప్పారు. 

సూర్యాపేటలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి జగదీశ్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం శాలువా, పట్టువస్త్రాలతో సత్కరించారు. అమ్మవారి దర్శనానంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలంతా పాడిపంటలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.


More Telugu News