బంగ్లాలో కాళీమాత‌కు మోదీ బ‌హుక‌రించిన కిరీటం చోరీ ఘటన.. దొంగ‌ల‌ను త్వ‌ర‌గా ప‌ట్టుకోవాల‌ని కోరిన‌ భార‌త్

  • 2021లో జెశోరేశ్వరి కాళీమాత‌కు కిరీటాన్ని కానుక‌గా ఇచ్చిన‌ ప్ర‌ధాని మోదీ 
  • గురువారం చోరీకి గురైన కిరీటం
  • బంగ్లా స‌ర్కార్ వెంట‌నే దీనిపై విచార‌ణ చేప‌ట్టి కిరీటం స్వాధీనం చేసుకోవాల‌న్న భార‌త్‌
బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరీ ఆలయంలో కాళీమాతకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కానుక‌గా ఇచ్చిన కిరీటం చోరీకి గురైన విషయం విదితమే. ఈ విష‌య‌మై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, దొంగ‌లను పట్టుకొని, కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని బంగ్లాదేశ్ స‌ర్కార్‌ను కోరింది.  

2021లో బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో జెశోరేశ్వరి కాళీమాత‌ ఆలయానికి ప్ర‌ధాని మోదీ కానుక‌గా ఇచ్చిన కిరీటం దొంగిలించ‌బ‌డింద‌నే వార్త‌లు మా దృష్టికి వ‌చ్చాయి. ఈ విష‌య‌మై మేం తీవ్ర ఆందోళ‌న చెందుతున్నాం. బంగ్లా స‌ర్కార్ వెంట‌నే దీనిపై విచార‌ణ చేప‌ట్టి, కిరీటం స్వాధీనం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. అలాగే నేర‌స్థుల‌ను శిక్షించాల‌ని కోరుతున్నాం అని భార‌త ఎంబ‌సీ ట్వీట్ చేసింది.

అస‌లేం జరిగిందంటే..!
బంగ్లాదేశ్ లోని సత్ఖీరా జిల్లా శ్యామ్నగర్‌లో జెషోరేశ్వరీ దేవీ ఆలయం ఉంది. ఆ ఆలయంలోని కాళీ మాతకు 2021లో భారత ప్రధాని ఒక కిరీటాన్ని బ‌హూక‌రించారు. అయితే, గురువారం ఆలయ పూజారి పూజలు ముగించి, బయటకు వెళ్లిన తరువాత మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల ప్రాంతంలో కిరీటం చోరీకి గురైంది. దీంతో దొంగలను గుర్తించేందుకు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.


More Telugu News