147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌డం రెండోసారి మాత్ర‌మే.. పాక్ బౌల‌ర్ల పేరిట అత్యంత చెత్త రికార్డు!

  • ముల్తాన్ వేదిక‌గా ఇంగ్లండ్‌, పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్‌
  • బౌలింగ్ వేసిన పాక్‌ ఆరుగురు బౌల‌ర్లు 100కు పైగా ప‌రుగులు ఇచ్చిన వైనం
  • 2004లో జింబాబ్వేకు చెందిన ఐదుగురు బౌల‌ర్ల పేరిట ఇలాంటి అవాంఛిత రికార్డు
  • 20 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసిన పాక్ బౌల‌ర్లు  
ముల్తాన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్టులో పాకిస్థాన్ బౌల‌ర్ల పేరిట ఓ చెత్త రికార్డు న‌మోదైంది. ఒక ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేసిన ఆరుగురు బౌల‌ర్లు వంద‌కు పైగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అమీర్ జమాల్, సైమ్ అయూబ్, అబ్రార్ అలీ, సల్మాన్ అలీ అఘా ఇలా ఆరుగురు కూడా 100కు పైగా ప‌రుగులు ఇచ్చారు. ఇలా జ‌ర‌గ‌డం 20 ఏళ్లలో తొలిసారి కాగా, 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండోసారి మాత్రమే. 

ఇంత‌కుముందు ఈ అవాంఛిత రికార్డు జింబాబ్వే మాజీ స్టార్‌లు డగ్లస్ హోండో, తినాషే పన్యాంగారా, తవాండా ముపరివా, ఎల్టన్ చిగుంబురా, స్టువర్ట్ మత్స్కీలెన్యే పేరిట ఉంది. 2004లో శ్రీలంకతో జరిగిన బులవాయో టెస్టులో ఇలా వారు ఒక్కొక్క‌రు వంద‌కు పైగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.  

ఇక ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్ ప‌ట్టుబిగించిన‌ట్లే క‌నిపిస్తోంది. దీంతో పాకిస్థాన్ మరో ఘోర పరాజయం ముంగిట నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌ 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ప‌ర్యాట‌క జ‌ట్టు కూడా అంతకంటే భారీ స్కోర్ న‌మోదు చేసి, పాక్‌పై పైచేయి సాధించింది. ఇంగ్లండ్ ఏకంగా 823/7 (డిక్లేర్‌) స్కోరు చేసింది. 

దాంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆ జ‌ట్టుకు 267 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 6 వికెట్లు కోల్పోయి 152 ర‌న్స్ చేసింది. ఇన్నింగ్స్ ఓట‌మి నుంచి త‌ప్పించుకోవాలంటే ఆతిథ్య జ‌ట్టు ఇంకా 115 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఇవాళ ఆఖ‌రి రోజు ఆట మిగిలి ఉంది. దీంతో పాక్ ఈ టెస్టు ఓట‌మి నుంచి త‌ప్పించుకోవ‌డం దాదాపు అసాధ్యంగా క‌నిపిస్తోంది. 

అంత‌కుముందు హ్యారీ బ్రూక్ , జో రూట్ వ‌రుస‌గా ట్రిపుల్, డ‌బుల్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన విష‌యం తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే 4వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (454 పరుగులు) నెలకొల్పి రికార్డుకెక్కారు. బ్రూక్ (317), రూట్ (262) ఫ్లాట్ ఉన్న‌ ముల్తాన్ పిచ్‌పై పరుగుల వ‌ర‌ద పారించారు. ఇద్దరూ కెరీర్‌లో అత్యుత్తమ వ్య‌క్తిగ‌త‌ స్కోర్‌లను సాధించారు.


More Telugu News