ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
  • బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్ర వాయుగుండంగా మారొచ్చని అంచనా
  • ఏపీకి మరో తుపాను ముప్పు పొంచివుందని అప్రమత్తత
  • ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరాన్ని దాటే ఛాన్స్
  • ఈ నెల 14 -16 మధ్యలో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జోరుగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా, అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అప్రమత్తం చేశారు. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారేందుకు అవకాశం ఉందని, ఈ నెల 13 - 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందవచ్చని, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనాగా ఉంది. ఒకవేళ వాయుగుండం కాస్తా తుపానుగా బలపడితే ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటవచ్చని, అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుపానుపై మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు పల్నాడు, శ్రీసత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో నేడు (గురువారం) పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.


More Telugu News