రతన్ టాటా మృతికి నివాళులర్పించిన ఏపీ కేబినెట్

రతన్ టాటా మృతికి నివాళులర్పించిన ఏపీ కేబినెట్
  • రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు 
  • విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని కితాబు
  • ఆయ‌న మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటన్న సీఎం
ఏపీ ప్రభుత్వ కేబినెట్ సమావేశం కొద్దిసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమావేశం కొన‌సాగుతోంది. ముందుగా వ్యాపార దిగ్గ‌జం రతన్ టాటా మృతికి ఏపీ మంత్రివర్గం సంతాపం తెలిపింది. ముఖ్య‌మంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నివాళులర్పించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. 

రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా... ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషణ్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

ఇక ఈ కేబినెట్ స‌మావేశంలో ప్ర‌భుత్వం ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా ఈ సమావేశంలో చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.



More Telugu News