సహారా ఎడారిలో వరదలు.. 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న సరస్సులో నిలిచిన నీళ్లు

  • మొరాకోలో సెప్టెంబర్ నెలలో భారీ తుపాను
  • రెండు రోజుల్లోనే భారీ వర్షపాతం నమోదు
  • 50 ఏళ్లుగా నిండిపోయి ఉన్న సరస్సు ఇరికీలోకి చేరిన నీళ్లు
సహారా ఎడారిలో వరదలు.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సెప్టెంబర్‌ నెలలో ఒక రెండు రోజులు కురిసిన విపరీతమైన వర్షాలు మొరాకోలోని సహారా ఎడారిలో వరదలను సృష్టించాయి. ఎంతగా అంటే ఎడారిలో గత 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న ‘ఇరికీ’ సరస్సులో నీళ్లు నిలిచాయి. ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతం కేవలం 2 రోజుల్లోనే కురవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఇరికీ సరస్సు జగోరా, టాటా ప్రాంతాల మధ్య ఉంది. గత 50 సంవత్సరాలుగా ఎండిపోయి ఉంది. భారీ వర్షాలతో నిండిపోయినట్టు నాసా ఉపగ్రహాల చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. ఈ సరస్సు మాత్రమే కాకుండా ఎడారిలోని మరికొన్ని శుష్క ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచాయి.

ఈ ఏడాది సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొన్ని దశాబ్దాల కాలంలో అత్యధికమని మొరాకో ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా దేశ ఆగ్నేయ భాగంలో ఉన్న రబాత్‌ అనే గ్రామంలో ఒక రోజులోనే ఏకంగా 4 అంగుళాల మేర వర్షం కురిసిందని వివరించింది. మెర్జౌగా అనే గ్రామంలో కూడా భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది. సాధారణంగా ఏడాది మొత్తం కలిపి 10 అంగుళాల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అలాంటి ఇంత తక్కువ సమయంలో భారీ వర్షం నమోదవడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. పెద్ద ఎత్తున తరలివెళ్లి ఎడారిలో నీటిని వీక్షిస్తున్నారు. వరుసగా ఆరు సంవత్సరాల కరవు తర్వాత ఈ భారీ వర్షం పడిందని చెబుతున్నారు.

ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వర్షం కురిసి 30 నుంచి 50 సంవత్సరాలు అయిందని మొరాకో మెటియోరాలజీ జనరల్ డైరెక్టరేట్ హౌసిన్ యూబెబ్ తెలిపారు. గాలిలో తేమ పెరిగిందని, దేశ వాతావరణంపై సంవత్సరాల తరబడి ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో భారీ తుపాను ప్రభావంతో రిజర్వాయర్లు రికార్డు వేగంతో నిండాయని, స్థానికులకు అదనపు నీటి వనరులను సమకూర్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు కరవును దూరం చేయడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేది చూడాల్సి ఉందని అన్నారు. మరోవైపు భారీ తుపాను  మొరాకోతో పాటు పక్కనే ఉన్న అల్జీరియాపై ప్రభావం చూపింది. రెండు దేశాల్లో కలిపి 20 మంది చనిపోయారు. పంటలు కూడా దెబ్బతిన్నాయి.


More Telugu News