రతన్ టాటా నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?

  • సంపాదన కంటే విలువలకే ప్రాధాన్యత ఇచ్చిన రతన్ టాటా
  • 2022లో ఆయన ఆస్తి విలువ రూ.3,800 కోట్లుగా పేర్కొన్న హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిపోర్ట్
  • దాతృత్వానికి ఎంతో ప్రాధాన్యత నిచ్చిన పారిశ్రామిక దిగ్గజం
విలువలతో కూడిన వ్యాపారానికి మారుపేరుగా నిలిచిన రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో రాత్రి 11.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దిగ్గజ వ్యాపారవేత్త మరణ వార్త విని దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ అందరూ తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. ఇక రతన్ టాటా జీవిత విశేషాల విషయానికి వస్తే ఆయన నికర ఆస్తి విలువ ఎంతనేది ఆసక్తికరంగా మారింది.

రతన్ టాటా సంపద ఎంతంటే..
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం రతన్ టాటా నికర ఆస్తి విలువ రూ.3,800 కోట్లుగా ఉంది. 2022లో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో 421వ స్థానంలో నిలిచారు. అయితే రతన్ టాటా సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అత్యంత విలువలను పాటిస్తూ భారతీయుల జీవితాలను మెరుగుపరచాలని నిత్యం ఆలోచించారు. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక విలువలకు కట్టుబడి జీవితాంతం పనిచేశారు. జీవితంలో పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నారు. టాటా గ్రూపుకు నాయకత్వం వహించిన తీరు ఆయనను దేశ పారిశ్రామికవేత్తలలో ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిపింది. దాతృత్వానికి రతన్ టాటా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. భారత్‌లో సంభవించిన ఎన్నో విపత్తుల సమయాల్లో భారీ విరాళాలను ప్రకటించారు.

టాటా గ్రూప్ ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లు ఇవే..
రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూపు అనేక ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లను ఉత్పత్తి చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఎయిర్ ఇండియా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా టీ, టాటా ప్లే, టైటాన్, స్టార్‌బక్స్, వోల్టాస్‌తో పాటు అనేక ఇతర బ్రాండ్‌లు ఉన్నాయి. అమితమైన విలువ సాధించిన ఈ బ్రాండ్లు టాటా గ్రూప్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా నిలిపాయి.


More Telugu News