ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు సీఎం చేశారు: రేవంత్ రెడ్డి

  • డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందించిన రేవంత్
  • కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి
  • కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు సీఎం చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల ఉద్యోగాలు ఊడితేనే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని తాను ఆనాడే చెప్పానని రేవంత్ అన్నారు. చెప్పినట్టుగానే తమ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ పత్రాలు ఇచ్చామని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేశామని అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 34 వేల ఉద్యోగుల బదిలీలు చేశామని చెప్పారు. ఉద్యోగాలు పొందిన మీ అందరి ఆనందం చూసి కొందరు కళ్లలో నిప్పులు పోసుకుంటారని అన్నారు. 

కేసీఆర్ కూతురు కవిత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే... ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని రేవంత్ దుయ్యబట్టారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్ ఓడిపోతే... ఆయనను ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చేసుకున్నారని చెప్పారు. మరి, తెలంగాణ కోసం త్యాగం చేసిన నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. మీ ఇంట్లో సంతోషం ఉండాలి కానీ... పేద ప్రజల ఇళ్లలో సంతోషం వద్దా? అని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా... పేదలు, నిరుద్యోగుల కోసం పని చేస్తున్నానని రేవంత్ చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తే బాగుంటుందని... కానీ, ఆయన అది చేయడం లేదని దుయ్యబట్టారు. బిల్లా, రంగాలను (కేటీఆర్, హరీశ్) ఊరి మీదకు వదిలి తమ కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు నామోషీగా ఫీల్ అవుతున్నారని... ఆ పరిస్థితి మారాలని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఈనెల 11న యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.


More Telugu News