చ‌రిత్ర లిఖించిన జో రూట్‌.. అరుదైన ఫీట్‌తో తొలి బ్యాట‌ర్‌గా ఘ‌న‌త‌!

  • టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 5 వేల‌ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా రూట్‌
  • అత‌ని త‌ర్వాతి స్థానంలో ల‌బుషేన్ (3,904), స్టీవ్ స్మిత్ (3,484)
  • మ‌రో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో జో రూట్‌
ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న‌ తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన‌ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు. గత మంగళవారం రూట్ 32 ప‌రుగులు చేసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) చరిత్రలో 5 వేల‌ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అతడు డ‌బ్ల్యూటీసీలో మొత్తం 59 మ్యాచ్‌లు ఆడి 5,005 పరుగులు చేశాడు. అత‌ని త‌ర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ ల‌బుషేన్ ఉన్నాడు. అత‌డు 3,904 ర‌న్స్ బాదాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన‌ స్టీవ్ స్మిత్ (3,484) ఉన్నాడు.

మ‌రో అరుదైన రికార్డుకు చేరువ‌లో రూట్‌
ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో రెడ్‌ బాల్ క్రికెట్‌లో అత్య‌ధిక‌ సార్లు 1000 ప్ల‌స్ ప‌రుగుల రికార్డుకు కూడా జో రూట్ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ పేరిట ఉంది. త‌న టెస్టు కెరీర్‌లో స‌చిన్ ఆరు సార్లు ఈ ఫీట్‌ను న‌మోదు చేశాడు. 

33 ఏళ్ల రూట్ ఇప్ప‌టి వ‌రకు ఐదు సార్లు ఇలా ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో వెయ్యికి పైగా ప‌రుగులు కొట్టాడు. మ‌రో 1000 ప్ల‌స్ ఫీట్‌ను సాధిస్తే లిటిల్ మాస్ట‌ర్ రికార్డును స‌మం చేస్తాడు. ఇప్ప‌టికే ఈ జాబితాలో ఉన్న బ్రియాన్ లారా, మాథ్యూ హేడెన్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, అలిస్టర్ కుక్‌లతో రూట్‌ సమంగా ఉన్నాడు.


More Telugu News