చంద్రబాబు వచ్చే సమయంలో కూడా భక్తులకు దర్శనాన్ని ఆపబోము: అనిత

  • కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనిత
  • భవానీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి
మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నానని... ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లను పరిశీలించానని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులతో కూడా మాట్లాడానని... ఏర్పాట్లన్నీ బాగున్నాయని అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు.  సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అంతరాలయ దర్శనాన్ని ఈరోజు నిలిపివేశామని తెలిపారు. సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఈరోజు అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

భవానీ మాల వేసుకున్న భక్తులకు ప్రత్యేకమైన క్యూలైన్ ఏర్పాటు చేయబోతున్నామని అనిత తెలిపారు. అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. సీఎం వచ్చే సమయంలో కూడా భక్తులకు దర్శనాన్ని నిలుపదల చేయబోమని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారని... ఆయన వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని చెప్పారు.


More Telugu News