సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ .. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం

  • ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
  • వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం 
  • నేడు రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన బుధవారం కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నేడు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పోలీసులు భక్తులను కంపార్ట్ మెంట్లలో ఉంచి క్యూలో పంపుతున్నారు. 

దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడికి ఆలయ సిబ్బంది ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నారు. ఈరోజు టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకువజాము 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు రెండు లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. 

మూలా నక్షత్రం విశిష్టత
మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన తర్వాత దుర్గామాతను శరన్నవరాత్రి ఉత్సావాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి రూపంలో అలంకరిస్తారు. సరస్వతీ దేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో రాణిస్తారని భక్తుల నమ్మకం.


More Telugu News