చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు

  • వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 5000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర
  • పాకిస్థాన్‌-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రికార్డు సాధించిన స్టార్ క్రికెటర్
  • సచిన్ టెండూల్కర్‌కు అడుగు దూరంలో నిలిచిన జో రూట్
ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ సంచలన రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) 5,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా అవతరించాడు. ఆట 2వ రోజున 54 బంతుల్లో 32 పరుగులు సాధించడంతో ఈ రికార్డు అతడి సొంతమైంది.

వ్యక్తిగత స్కోరు 27 పరుగుల వద్ద జో రూట్ ఈ రికార్డు అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 59 మ్యాచ్‌లు ఆడి 5,005 పరుగులు సాధించాడు. అతడి తర్వాతి స్థానంలో 3,904 పరుగులతో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ నిలిచాడు. ఆసీస్‌కే చెందిన స్టీవ్ స్మిత్ 3,484 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

జో రూట్ టెస్టుల్లో మరో 39 పరుగులు సాధిస్తే ఇంగ్లండ్ టాప్ స్కోరర్‌గా అలిస్టర్ కుక్‌ను కూడా అధిగమిస్తాడు. జో రూట్ ఫామ్‌ను బట్టి చూస్తే ముల్తాన్ టెస్టులోనే అతడు ఈ రికార్డు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

సచిన్ రికార్డుపై గురి..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుపై కూడా జో రూట్ కన్నేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ సరసన చేరేందుకు రూట్ మరో అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటికే రూట్ 1000 పరుగుల మైలురాయిని సాధించాడు. దీంతో మొత్తం 5 క్యాలెండర్ సంవత్సరాలలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ మొత్తం 6 సార్లు ఈ ఘనత సాధించాడు. సచిన్ రికార్డును అందుకోవాలంటే జో రూమ్ మరో ఏడాది 1000 పరుగులను సాధించాల్సి ఉంటుంది. జో రూట్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలే కాబట్టి అతడు సాధించే అవకాశాలు ఉన్నాయి.

కాగా ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో  1000కి పైగా టెస్ట్ పరుగులను సాధించిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్‌తో పాటు బ్రియాన్ లారా, మాథ్యూ హెడెన్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, అలిస్టర్ కుక్‌ ఉన్నారు. రూట్ మినహా మిగతావారంతా రిటైర్ అయ్యారు.


More Telugu News