ఏపీలో అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు

  • రేషన్ కార్డుల్లో మార్పు, చేర్పులకు కూడా అవకాశం
  • 4 వేల కొత్త రేషన్ దుకాణాల ఏర్పాట్లు, డీలర్ల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం
  • రేషన్‌కార్డులు పొందేందుకు ఆదాయ పరిమితి కూడా సడలింపు!
రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

రేషన్‌కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ. 12 వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్‌కార్డు కోల్పోయారు. ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి తమకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీపైనా నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న ఆరువేల రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.


More Telugu News