హైడ్రా కూల్చివేతలతో రూ.1 లక్ష కోట్లకు పైగా వృథా అయ్యే అవకాశం: జగదీశ్ రెడ్డి

  • ప్రజలు ఇప్పటికే రూ.1,000 కోట్లు నష్టపోయారన్న జగదీశ్ రెడ్డి
  • మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రణాళిక ఏమిటో చెప్పాలని నిలదీత
  • సుందరీకరణ అంటే ఇళ్లు, గుడిసెలు కూలగొట్టడం కాదని చురక
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల కారణంగా రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యే అవకాశముందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రూ.1,000 కోట్ల వరకు ప్రజలు నష్టపోయారన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏమిటో చెప్పాలని నిలదీశారు.

చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అసలు ప్రభుత్వం వద్ద మూసీపై డీపీఆర్ ఉందా? అని ప్రశ్నించారు. మూసీని, హుస్సేన్ సాగర్‌ను మురికికూపంలా మార్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. సుందరీకరణ అంటే ఇళ్లు, గుడిసెలు కూలగొట్టడం కాదన్నారు. మూసీలో కలిసే మురికి నీటిని, కాలుష్యాన్ని ఆపడం సుందరీకరణ అంటారని చురక అంటించారు. 

మూసీ సుందరీకరణ తమ హయాంలోనే ప్రారంభమైందని, రూ.16 వేల కోట్ల ఖర్చు అవుతుందని డీపీఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తీసుకువచ్చి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికీ మూసీ ప్రక్షాళన చేసేందుకు తాము సిద్ధమని, ఆ ప్రాజెక్టు మాకు ఇచ్చే దమ్ము మీకు ఉందా? అని సవాల్ చేశారు. ప్రభుత్వం వద్ద రుణమాఫీకే డబ్బులు లేవు, మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలన్నారు.


More Telugu News