ఆరంభ ట్రెండ్ రివర్స్.. ఉత్కంఠభరితంగా మారిన హర్యానా ఎన్నికల కౌంటింగ్

  • ఆధిక్యంలోకి దూసుకొచ్చిన బీజేపీ
  • మేజిక్ ఫిగర్‌ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజ
  • అనూహ్యంగా వెనుకబడిన కాంగ్రెస్
  • సంబరాలను నిలిపివేసిన హస్తం పార్టీ శ్రేణులు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేపుతోంది. కౌంటింగ్ ఆరంభంలో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడింది. అధికార బీజేపీ లీడ్‌లోకి దూసుకొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 సీట్లు కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ అభ్యర్థులు 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉంటుంది.

ఇక ఆరంభంలో భారీ లీడ్ సాధించిన కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి 35 స్థానాలకు పడిపోయింది. మరో 6 చోట్ల ఇతరులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో హర్యానా ఎన్నికల ఫలితాలు సస్పెన్స్ త్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఏకంగా ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి 55కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీ 26 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని లెక్కలుగట్టాయి. కానీ ప్రస్తుత సరళిని చూస్తుంటే ఫలితాలు భిన్నంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో కౌంటింగ్ మొదలు కాకముందే గెలుపు సంబరాలను మొదలుపెట్టిన కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గాయి. వేడుకలను నిలిపివేశాయి.

కాగా కౌంటింగ్ ప్రారంభం కాకముందే న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి. డప్పులు వాయిస్తూ డ్యాన్స్ చేశారు. 

కాగా గత 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి. జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం నుంచి దుష్యంత్ చౌతాలా బయటకు వచ్చారు.

మరోవైపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 29, ఇతరులు 10 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా మేజిక్ ఫీగర్ 46 స్థానాలుగా ఉంది.


More Telugu News