మీ కంటే ఇండియన్ హిందూ ఆఫీసర్ నయం.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్ ఫైర్.. వీడియో ఇదిగో!

  • పాకిస్థాన్‌లో పర్యటించిన జకీర్ నాయక్
  • బ్యాగేజీపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తామన్న పీఐఏ
  • ఇస్తే వందశాతం ఇవ్వాలని, లేదంటే లేదని ఆగ్రహం
  • ఇండియాలో అయితే పూర్తి ఫ్రీగా ఉండేదని వ్యాఖ్య
వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు డాక్టర్ జకీర్ నాయక్‌కు తత్వం బోధపడింది. పాకిస్థాన్ కంటే భారత్ ఎంతో నయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో పర్యటించిన ఆయన ఆ దేశ ఎయిర్ లైన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు బ్యాగేజీపై చార్జీలను విధించడమే ఆయన మండిపాటుకు కారణం. తన బ్యాగేజీపై 50 శాతం చార్జీలను మాత్రమే తగ్గిస్తామని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) చెప్పడంతో ఆయన దానిని తిరస్కరించారు. ఈ సందర్భంగా భారత్, పాక్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వెల్లడించారు. భారత్‌లోని ఒక హిందూ అధికారి కూడా బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిస్తాడని, కానీ మీరు ముస్లిం అయి ఉండి కూడా చార్జీలు వసూలు చేయడం ఏమీ బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నేను పీఐఏ సీఈవోతో మాట్లాడా. డాక్టర్ సాబ్ మీ కోసం ఏమైనా చేస్తామని చెప్పారు. మేం ఐదారుగురం ప్రయాణిస్తున్నాం, 500 లేదంటే 600 కేజీల అదనపు బ్యాగేజీ ఉంటుందని చెప్పాను. దీంతో ఆయన 50 శాతం చార్జీలు తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నేను.. 100 శాతం డిస్కౌంట్ ఇస్తే ఇవ్వండి. లేదంటే దాని గురించి మర్చిపొమ్మని చెప్పాను. ఇండియాలో ఎవరైనా నన్ను చూస్తే, అతడు ముస్లిం కాకున్నా నన్ను ఉచితంగా పంపేవాడు. 1000, 2 వేల కిలోలున్నా డాక్టర్ సాబ్‌దని ఉచితంగా పంపేవాడు. ఇండియా అంటే అదీ’’ అని వ్యాఖ్యానించారు. పాక్‌లో తన పరిస్థితిపై మాట్లాడుతూ.. ‘‘నేను ఈ దేశానికి అతిథినని వీసా చెబుతోంది. పాక్ ఎయిర్ లైన్స్ మాత్రం 50 శాతం తగ్గింపు అంటోంది. వారు చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ దేశానికి వస్తున్నందుకు నాకు చాలా బాధ అనిపించింది’’ అని జకీర్ నాయక్ ఆక్రోశం వెళ్లగక్కారు. గత కొన్నాళ్లుగా మలేషియాలో ఉంటున్న జకీర్ నాయక్ నెల రోజుల పర్యటన నిమిత్తం పాకిస్థాన్ కి వచ్చారు.    


More Telugu News