హర్యానా, జమ్మూకశ్మీర్ లో నేడు ఓట్ల లెక్కింపు... అందరి దృష్టి ఇటువైపే!

  • హర్యానా, జమ్మూకశ్మీర్ లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్ల పూర్తి  
  • ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు 
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవ్వనున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ, యూపీఏ మధ్య ఇదే తొలి ప్రత్యక్ష పోరు కావడం, మరి కొన్ని నెలల్లో మహారాష్ట్ర, ఝార్ఘండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

హర్యానాతో పాటు జమ్మూకశ్మీర్ లో హస్తం (కాంగ్రెస్) జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చినప్పటికీ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ లో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు తమ గెలుపు అవకాశాలపై ధీమాతో ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 90 సీట్లకు గానూ 873 మంది నేతలు బరిలో నిలిచారు. మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, 63.45 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46 కాగా, ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు తాము సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

బీజేపీ స్వతంత్ర అభ్యర్ధులపై ఆశలు పెట్టుకుంది. మరో వైపు తమ మద్దతు లేకుండా జమ్మూకశ్మీర్ లో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని పీడీపీ అంటోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 35 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రులు, భారసారూప్యత కలిగిన గ్రూపులతో కలిసి బీజేపీ మెజార్టీ మార్కు సాధిస్తుందని ఆయన పేర్కొంటున్నారు. 

ఇక హర్యానాలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్ఢీ - బీఎస్పీ, జేజేపీ - అజాద్ సమాజ్ పార్టీలు పోటీ పడ్డాయి. అత్యధిక స్థానాల్లో బీజేపీ- కాంగ్రెస్ మధ్యే నువ్వా? నేనా? అన్నరీతిలో పోటీ జరిగింది. మొత్తం 90 స్థానాలకు గానూ 1031 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా, వీరిలో 464 మంది స్వతంత్ర అభ్యర్ధులే ఉండటం విశేషం. అక్టోబర్ 5న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 67.90 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను బీజేపీ సీనియర్ నేత, సీఎం నయాబ్ సింగ్ కొట్టిపారేశారు. పూర్తి స్థాయి మెజార్టీతో మూడోసారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొడతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలను కాంగ్రెస్ నిందించడం ఖాయమని సెటైర్ వేశారు.


More Telugu News