ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే.. ఆయ‌న‌తో ఒక మంచి ఆలోచ‌నను పంచుకుంటాను: న‌టుడు షాయాజీ షిండే

  • ఆల‌యాల్లో ప్ర‌సాదంతో పాటు మొక్క‌లు ఇవ్వాల‌న్న షాయాజీ షిండే
  • ఇప్ప‌టికే తాను ఈ విధానాన్ని మ‌హారాష్ట్ర‌లోని 3 ఆల‌యాల్లో పాటిస్తున్న‌ట్లు వెల్ల‌డి
  • జ‌న‌సేనాని అపాయింట్‌మెంట్ దొరికితే అన్ని వివ‌రాలు ఆయ‌న‌తో చెబుతాన‌న్న విల‌క్ష‌ణ న‌టుడు
  • 'మా నాన్న సూప‌ర్ హీరో' మూవీ ప్ర‌చారంలో భాగంగా బిగ్‌బాస్-8లో పాల్గొన్న షాయాజీ
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇస్తే త‌న వ‌ద్ద ఉన్న ఒక అద్భుత‌మైన ఆలోచ‌న‌ను ఆయ‌న‌తో పంచుకుంటాన‌ని విల‌క్ష‌ణ న‌టుడు షాయాజీ షిండే అన్నారు. ఆల‌యాల్లో ప్ర‌సాదంతో పాటు భ‌క్తుల‌కు ఒక మొక్క‌ను ఇస్తే బాగుంటుంద‌ని, తాను ఇప్ప‌టికే ఈ ప‌ని చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. సుధీర్ బాబు హీరోగా వ‌స్తున్న 'మా నాన్న సూప‌ర్ హీరో' మూవీలో షాయాజీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

ద‌స‌రా సందర్భంగా ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. దీంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బిగ్‌బాస్ సీజ‌న్‌-8లో హీరో సుధీర్ బాబుతో క‌లిసి షాయాజీ పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ఈ విల‌క్ష‌ణ న‌టుడి గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని పంచుకున్నారు. ఖాళీ ప్ర‌దేశం క‌న‌ప‌డితే చెట్లు నాటు‌తార‌ని వ్యాఖ్యాత నాగార్జున‌తో అన్నారు. దీంతో నాగ్ ఇలా షాయాజీ మొక్క‌లు నాట‌డం వెనుక ఉన్న కార‌ణాన్ని ఆయ‌న్ను అడిగారు.

అప్పుడు షాయాజీ షిండే మాట్లాడుతూ.. త‌న తల్లి 1997లో క‌న్నుమూసిన‌ట్లు తెలిపారు. ఆమె బ‌తికి ఉన్న స‌మ‌యంలో త‌న వ‌ద్ద ఇంత డ‌బ్బు ఉన్నా ఆమెను బ‌తికించుకోలేను.. నేనేం చేయ‌ను అని బాధ‌ప‌డ్డాను. అప్పుడే త‌న‌కు ఒక ఆలోచ‌న వ‌చ్చింద‌ని, దాన్ని త‌న అమ్మ‌తో పంచుకున్న‌ట్లు తెలిపారు. అదే.. త‌న అమ్మ‌ బరువుకు స‌మాన‌మైన విత్త‌నాలను తీసుకుని, దేశం మొత్తం నాటుతాన‌ని ఆయన అన్నార‌ట‌. తాను నాటిన విత్త‌నాలు చెట్లుగా మార‌డంతో పాటు నీడ‌ను పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసిన‌ప్పుడ‌ల్లా త‌న‌కు త‌న అమ్మ‌ గుర్తుకు వ‌స్తార‌ని తెలిపారు. 

దీన్ని ఆల‌యాల్లో వ‌చ్చే భ‌క్తుల ద్వారా చేప‌డితే ఇంకా బాగుంటుంద‌ని ఆలోచించి మ‌హారాష్ట్ర‌లోని మూడు దేవాల‌యాల్లో ప్రారంభించిన‌ట్లు షాయాజీ చెప్పుకొచ్చారు. అయితే, గుడికి వ‌చ్చే అంద‌రికీ కాకుండా ఎవ‌రైతే అభిషేకం చేస్తారో వారితో సుమారు 100 నుంచి 200 మందికి ప్రసాదంగా వీటిని ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 

ఒక‌వేళ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఇస్తే, ఆయ‌న్ను క‌లిసి ఈ వివ‌రాల‌న్నీ చెబుతాన‌ని అన్నారు. దేవుడి ప్ర‌సాదంలానే మొక్క‌ల‌ను అంద‌రికీ పంచాలని, అవి నాటితే పెరిగి చెట్లు అవుతాయ‌న్నారు. త‌ర్వాత అవి ఏడు జ‌న్మ‌ల‌కు పెరుగుతూనే ఉంటాయ‌ని షాయాజీ చెప్పడంతో ఆయ‌న ఆలోచ‌న అద్భుతంగా ఉందంటూ నాగార్జున ప్ర‌శంసించారు. ఈ విష‌యంలో మీకు త‌ప్ప‌కుండా ప‌వ‌న్ అభిమానులు సాయం చేస్తార‌ని నాగ్‌, సుధీర్‌బాబు ఆయ‌న‌తో చెప్పారు.


More Telugu News