గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి ఏడాది.. వైట్‌హౌస్ వద్ద నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకున్న జర్నలిస్ట్.. వీడియో ఇదిగో!

  • ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసి ఏడాది
  • ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు 41,825 మంది పాలస్తీనియన్లు మృతి
  • ఇజ్రాయెల్‌కు సాయం ఆపాలంటూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు
  • యుద్ధంలో చనిపోయిన వారి ఫొటోలతో నినాదాలు
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి రేపటితో ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో గాజాపై తక్షణం కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ తనకు తాను నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, నిరసనకారులు నీళ్లు చల్లి, స్కార్ఫ్‌లతో మంటలు ఆర్పివేశారు. మంటలు చెలరేగినా అతడు మాత్రం నినాదాలు చేయడం మానలేదు. మంటల కారణంగా అతడి చేయిపై చర్మం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు అతడిని జర్నలిస్టుగా గుర్తించారు. అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.  

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనాలో 41,825 మంది ప్రాణాలు కోల్పోగా, ఇజ్రాయెల్‌లో 1,205 మంది మృతి చెందారు. యుద్ధాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామి ఇజ్రాయెల్‌కు సాయం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైట్‌హౌస్ వెలుపల వెయ్యిమందికిపైగా నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. 

న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద కూడా వేలాదిమంది ఆందోళనకు దిగారు. ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన వారి ఫొటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అమెరికాకు తాము కడుతున్న పన్నులు ఇజ్రాయెల్‌లో బాంబుల తయారీకి వెళ్తోందని ఆరోపించారు. లాస్ ఏంజెలెస్‌లోనూ గాజాలో మారణహోమంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


More Telugu News