తెలంగాణ సర్కార్ తాజా ఆర్డినెన్స్‌కు గెజిట్ విడుదల ..హైడ్రాకు మరింత బలం

  • బల్దియా చట్టంలో మార్పులు చేసిన సర్కార్
  • ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు  గవర్నర్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • హైడ్రాకి చట్టబద్ద అధికారాలకు ప్రభుత్వ నిర్ణయం
బల్దియా చట్టంలో కొత్త సెక్షన్ (374 బీ) చేరుస్తూ తెలంగాణ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపగా, శనివారం రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైడ్రాకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. 

తాజా చట్టం ద్వారా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా బదిలీ చేయవచ్చు. జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీ నిర్ణయించింది. అయితే అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని గవర్నర్‌కు ప్రతిపాదనలను పంపారు. గవర్నర్ ఆమోదించడంతో తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఆర్డినెన్స్ అమలు ఆరు నెలల వరకూ ఉండనున్న నేపథ్యంలో ఆ లోపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ చట్ట సవరణకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోనుంది. సెక్షన్ 374 బీ లోని అధికారాలను హైడ్రాకు బదలాయిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ ఎటువంటి చట్టపరమైన అవాంతరాలు లేకుండా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.


More Telugu News