మాజీ క్రికెటర్ తల్లి అనుమానాస్పద మృతి.. ఫ్లాట్‌లో గొంతు కోసి..

  • పూణేలో సలీల్ అంకోలా తల్లి మాల అశోక్ అంగోలా (77) అనుమానాస్పద మృతి
  • శరీరంపై గాయాలు, గొంతు కోసి ఉన్న స్థితిలో మృతదేహం గుర్తింపు
  • ఆమే గాయాలు చేసుకొని చనిపోయి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు 
మాజీ క్రికెటర్, నటుడు సలీల్ అంకోలా తల్లి మాల అశోక్ అంగోలా (77) అనుమానాస్పద రీతిలో చనిపోయారు. పూణేలోని తన ఫ్లాట్‌లో శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై గాయాలతో, గొంతుకోసి ఉంది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే తానే గొంతు కోసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూణేలోని డెక్కన్ జింఖానా ప్రాంతంలోని ప్రభాత్ రోడ్‌లోని ఒక ఫ్లాట్‌లో ఆమె నివసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో పని మనిషి ఫ్లాట్‌కి వెళ్లగా ఎవరూ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి బంధువులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లగా ఆమె విగతజీవిగా పడి ఉన్నారని పోలీసులు తెలిపారు.

‘‘డోర్ తెరిచి చూడగా మహిళ గొంతు కోసి చనిపోయి ఉంది. స్వయంగా ఆమె గాయాలు చేసుకున్నట్టు ప్రాథమికంగా అనిపిస్తోంది. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నాం’’ అని పూణే డిప్యూటీ పోలీస్ కమిషనర్ (జోన్ I) సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ఆమె కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసిందని గిల్ చెప్పారు.

కాగా సలీల్ అంగోలా భారత జట్టుకు ఆడాడు. ఫాస్ట్-మీడియం బౌలర్ అయిన అతడు 1989 -1997 మధ్య కాలంలో టీమిండియా తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 20 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. తర్వాత సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించాడు.


More Telugu News