మీ ఆస్తులేమీ ఇవ్వొద్దు కానీ... మీ అనుభవాన్ని పేదల కోసం ఉపయోగించండి: బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన

  • మూసీ ప్రక్షాళన చేపట్టిన రేవంత్ ప్రభుత్వం
  • మూసీ నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి
  • మూసీ బఫర్ జోన్ లో ఉన్నవాళ్లు ఆందోళన చెందవద్దని సూచన
  • సూచనలు, సలహాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల ఆక్రమణలు, మూసీ నది పరీవాహక ప్రాంతంలో ప్రక్షాళనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, మూసీ పరీవాహక ప్రాంతంలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారు, ఇప్పుడు తమ ఇళ్లను కోల్పోనున్నారు. వారిలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. 

ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మూసీ బఫర్ జోన్ లో ఉన్నవాళ్లు ఆందోళన చెందవద్దని సూచించారు. మూసీ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల నుంచి రక్షించేందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల చొప్పున కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. 

"పాలనలో తమకు పదేళ్ల అనుభవం ఉందని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోంది. మీ ఆస్తులేమీ ఇవ్వొద్దు కానీ, మీ అనుభవాన్ని పేదల కోసం ఉపయోగించండి... రండి, అందరం కూర్చుని మాట్లాడుదాం... పేదల కోసం ఏం చేయగలమో చర్చిద్దాం. 

జీవితాంతం కష్టపడిన సొమ్ముతో కొనుక్కున్న ఆస్తి కోల్పోతే పేదలకు తప్పకుండా దుఃఖం ఉంటుంది... ఆ విషయం నాకు తెలియదా? భూమి బద్దలై చచ్చిపోతే బాగుండు అనేంతగా పేదలకు బాధ ఉంటుంది. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాను... పేదల బాధ ఎలా ఉంటుందో తెలియకుండానే ఇంత దూరం వచ్చానా? 

ఇప్పుడు ఫాంహౌస్ లను కాపాడుకునేందుకు పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం కాదు... ఆక్రమణలపై ఏం చేద్దామో సూటిగా చెప్పండి" అంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయని, బీఆర్ఎస్ చేసిన దోపిడీలో 10 శాతం తిరిగి ఇచ్చినా పేదలు బాగుపడతారని పేర్కొన్నారు.


More Telugu News