27 ఏళ్ల త‌ర్వాత ఇరానీ క‌ప్ గెలిచిన ముంబ‌యి

  • ల‌క్నో వేదిక‌గా ముంబ‌యి, రెస్టాఫ్ ఇండియా మ్యాచ్‌
  • మ్యాచ్ డ్రా కావ‌డంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేత‌గా ముంబ‌యి
  • ఓవ‌రాల్‌గా ఇరానీ ట్రోఫీని 15 సార్లు గెలిచిన‌ ముంబ‌యి జ‌ట్టు  
  • స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
ముంబ‌యి జ‌ట్టు ఇరానీ క‌ప్ విజేత‌గా నిలిచింది. రెస్టాఫ్ ఇండియాతో జ‌రిగిన మ్యాచ్ డ్రా కావ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఆధారంగా ముంబ‌యి విజేత‌గా అవ‌త‌రించింది. దీంతో 27 ఏళ్ల త‌ర్వాత ఆ జ‌ట్టు ఈ ట్రోఫీని సాధించిన‌ట్లైంది. ఇక ఓవ‌రాల్‌గా ముంబ‌యి జ‌ట్టు ఇరానీ ట్రోఫీని 15 సార్లు గెలిచింది.  

మ్యాచ్ విషయానికి వ‌స్తే... తొలి ఇన్నింగ్స్‌లో ముంబ‌యి 537 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముంబ‌యి బ్యాట‌ర్ల‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అజేయ ద్విశ‌త‌కం (222 నాటౌట్) సాధించ‌గా.. కెప్టెన్ అజింక్య ర‌హానే (97) త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకున్నాడు. మ‌రో బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అర్ద శ‌త‌కం (57)తో రాణించాడు. 

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా 416 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అభిమ‌న్యు ఈశ్వ‌రన్ భారీ శ‌త‌కం (191) సాధించ‌గా, ధ్రువ్ జురెల్‌ (93)కు కొద్దిలో సెంచ‌రీ చేజారింది. 

ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబ‌యి జ‌ట్టు ఆఖ‌రిదైన ఐదో రోజు 8 వికెట్ల‌కు 329 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టులో త‌నుష్ కొటియ‌న్ అజేయ శ‌త‌కం (114 నాటౌట్) చేయ‌గా, పృథ్వీ షా (76), మోహిత్ (51 నాటౌట్‌) అర్ధ శ‌త‌కాల‌తో రాణించారు. 

అయితే, మ్యాచ్ ఫ‌లితం తేలే అవ‌కాశం లేక‌పోవ‌డంతో డ్రాగా ముగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డ‌బుల్ సెంచ‌రీతో మెరిసిన ముంబ‌యి ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది.


More Telugu News