రింకూ సింగ్ చేతిపై కొత్త‌ టాటూ.. దాని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • తాను ఇంత‌వ‌ర‌కు రావ‌డానికి కార‌ణం అంతా దేవుడి ప్లానే అంటున్న రింకూ
  • ఈ నేప‌థ్యంలోనే త‌న చేతిపై టాటూ వేయించుకున్న‌ట్లు వెల్ల‌డి
  • యువ ఆట‌గాడి వీడియోను పంచుకున్న బీసీసీఐ
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డో మారుమూల గ్రామంలో పుట్టిన యువ సంచ‌ల‌నం రింకూ సింగ్‌, ఇవాళ టీమిండియాలో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ఈ ప్ర‌స్థానం వెనుక త‌న శ్ర‌మ మాత్ర‌మే కాక దేవుడి ప్లాన్ కూడా ఉందంటున్నాడ‌త‌ను. ఈ నేప‌థ్యంలోనే త‌న చేతిపై 'గాడ్స్ ప్లాన్' అంటూ ప‌చ్చ‌బొట్టు వేయించుకున్న‌ట్టు తెలిపాడు. ఈ ప‌చ్చ‌బొట్టు వెనుక ఉన్న నిజమైన క‌థ‌ను రింకూ తాజాగా పంచుకున్నాడు. ఆ వీడియోను బీసీసీఐ విడుద‌ల చేసింది. 

వీడియోలో రింకూ సింగ్ మాట్లాడుతూ... "నేను తరచుగా చెప్పే ఒక సామెత అందరికీ బాగా తెలుసు. అదే దేవుని ప్రణాళిక (గాడ్స్ ప్లాన్‌). కొన్ని వారాల క్రితం దాని ఆధారంగానే పచ్చబొట్టు వేయించుకున్నాను. దేవుడి ప్లాన్‌ కారణంగానే ఇప్పుడు అందరూ నన్ను గుర్తు ప‌డుతున్నారు. అది శాశ్వ‌తంగా ఉండాల‌నే ఇలా చేతిపై ప‌చ్చ‌బొట్టు రూపంలో వేయించుకున్నాను. ఇక ఈ టాటూలో నేను ఐపీఎల్‌లో కొట్టిన 5 సిక్స్‌లు ఉన్నాయి. ఆ సిక్సులే న‌న్ను టీమిండియా త‌లుపులు త‌ట్టేలా చేశాయి" అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఇక‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ఆడే ఈ యువ బ్యాట‌ర్ ప‌లుమార్లు తుపాను ఇన్నింగ్స్‌ల‌తో ఆ జ‌ట్టుకు ఎన్నో మ‌రపురాని విజ‌యాలు అందించాడు. ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో క్రీజులోకి వ‌చ్చి మంచి ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 

కాగా, 2023 ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)పై రింకూ ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవ‌రూ అంత సులువుగా మ‌రిచిపోలేరు. ఓడిపోతుంద‌నుకున్న మ్యాచ్‌ను వరుసగా ఐదు భారీ సిక్సర్లు కొట్టి ఊహించ‌ని విజ‌యాన్ని అందించాడు. ఆ విజయం అత‌ని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ఆ ఇన్నింగ్స్ కార‌ణంగా రింకూకు ఏకంగా భారత క్రికెట్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. దాంతో ప్ర‌స్తుతం టీ20ల్లో టీమిండియా త‌ర‌ఫున ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తున్నాడు. ఇక ఈ ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కి భారత తుది జట్టులో రింకూ సింగ్ ఆడే అవకాశం ఉంది.

బంగ్లాతో ప‌స్ట్ టీ20 కోసం భారత ప్లేయింగ్ XI అంచనా: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్ రానా, మ‌యాంక్‌ యాద‌వ్‌.


More Telugu News