ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్

  • ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.30లక్షలు పోగొట్టుకున్న యువకుడు హరీశ్
  • అప్పులు తీర్చడానికి పొలం విక్రయించిన తల్లిదండ్రులు
  • పొలం అమ్మినా అప్పులు తీరకపోవడంతో కుమారుడితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య
ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. అన్ లైన్ బెట్టింగ్ ద్వారా కుమారుడు చేసిన అప్పులు తీర్చలేక దంపతులు సహా వారి కుమారుడు బలవన్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సురేశ్ (53), హేమలత (45), వారి కుమారుడు హరీశ్ (22) ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

హరీష్ గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పబ్జీ గేమ్‌లో దాదాపు 30 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ అప్పులు తీర్చేందుకు సురేశ్ తన పొలం కూడా విక్రయించాడు. పొలం అమ్మినా అప్పులు తీరకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనబడక పోవడంతో మనస్థాపానికి గురై గత రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.


More Telugu News