బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

  • అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణ‌పై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చ‌రిక‌
  • రాయలసీమలోని జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ
  • తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో ఇవాళ‌, రేపు భారీ వ‌ర్షాలుంటాయ‌న్న వాతావార‌ణ శాఖ‌
బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ మరో అల్పపీడనం ప్ర‌భావం కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణ‌పై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చ‌రించింది‌. 

నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కార‌ణంగా ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో ఏర్ప‌డింద‌ని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌శ్చిమ బెంగాల్‌పై కూడా దీని ప్ర‌భావం కార‌ణంగా నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ పేర్కొంది. 

ఇక ఈ అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ‌ వెల్ల‌డించింది. కాగా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండ‌డంతో ఈ ప్రాంతంలోని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

నేడు ఏపీలోని తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఇక తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఇవాళ‌ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 

ఆదివారం నాడు నాగర్ కర్నూల్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.


More Telugu News