ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదు

  • ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఫిర్యాదు
  • తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదన్న లాయర్
  • అయినా ఉదయనిధిపై అనవసర వ్యాఖ్యలు చేశారని కమిషనర్‌కు కంప్లైంట్
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తమిళనాడులోని మధురైలో కేసు నమోదైంది. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. దీనిని ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. మీలాంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారని, కానీ సనాతన ధర్మం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో ఒకసారి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. దీంతో పవన్ ఆయనను ఉద్దేశించే ఈ హెచ్చరిక చేశారన్న వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కల్యాణ్‌పై మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి కూడా స్పందించారు. పవన్ కామెంట్స్‌పై మీ స్పందనేంటన్న ప్రశ్నకు ‘వెయిట్ అండ్ సీ’ అని బదులిచ్చారు.


More Telugu News